Education News

తెలంగాణా పభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు!


హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం మూడేళ్ల పిల్లలను చేర్చుకోవడం లేదు. ఐదేళ్లు నిండితేనే చేర్చుకుంటున్నాం. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బలవంతంగా ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఉంటే వారంతా ఇక్కడే చేరుస్తారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య పథకంలో భాగంగా దీనిని పక్కగా అమలు చేస్తాం..’’అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకువచ్చి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం ద్వారా ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు కలిసిన సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విలేకరులు అడిగిన వివిధ అంశాలపై మంత్రి పేర్కొన్న వివరాలు...
  • ప్రస్తుత మున్న పథకాలను కొనసాగిస్తూ.. లేదా వాటిని కలుపుకొని కేజీ నుంచి పీజీ పథకాన్ని అమలు చేస్తాం. విధానాల రూపకల్పన కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీ అధ్యయనం చేసి సిఫారసులు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాధాన్యాల్లో ఇది ఒకటి. అందుకే హడావుడిగా కాకుండా పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేశాకే విధానపర నిర్ణయాలు రూపొందిస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  • ముందుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యతపై దృష్టి పెడతాం. పక్కా పర్యవేక్షణకు చర్యలు చేపడతాం. మండల విద్యాధికారి (ఎంఈవో), డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉండటంతో పర్యవేక్షణ కొరవడుతోంది. అందుకే ఈ పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తాం. సంఘాలతోనూ మాట్లాడతాం. అయితే గ్రూపు-1 కేటగిరీలో డిప్యూటీ ఈవో పోస్టులను, గ్రూపు-2 కేటగిరీలో ఎంఈవో పోస్టులను డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందనే వాదనలు ఉన్నాయి. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అందరితో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం.
  • కొన్ని ప్రైవేటు కాలేజీలు తామే ప్రవేశ పరీక్ష పెట్టుకొని సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికా హక్కు ఉంది. అయితే, ప్రైవేటు యాజమాన్యాలే పరీక్ష నిర్వహించుకుకొని, ప్రవేశాలు చేపట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే వాదన వ్యక్తమవుతోంది. కన్సార్షియంగా ఏర్పడి నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే.. విద్యార్థులు ప్రభుత్వ పరీక్ష వైపు మొగ్గు చూపుతారు. అయితే, మైనారిటీ కాలేజీలు నిర్వహించుకునే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వారికి ఫీజును కొనసాగించే అవకాశం ఉంది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ తండ్రి పుట్టిన ప్రాంతం అనేదే స్థానికతకు ఆధారంగా తీసుకుంటుందనే విషయం నాకు తెలియదు. అది ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. రెండు మూడు రోజుల్లో ప్రవేశాల షెడ్యూలుపై స్పష్టత వస్తుంది.
  • విద్యాశాఖలోని చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగుల నుంచి తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోతామని విజ్ఞప్తులు వస్తున్నాయి. తమను రిలీవ్ చేయాలని కోరుతున్నారు.
  • త్వరలో డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆ విషయం ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది.
  • తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రతిపాదనలు రూపొందించే అంశంపై దృష్టి సారిస్తాం.

Comments

Popular Posts